Ind vs Aus: ఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియా .. ఆస్ట్రేలియాపై ప్రతీకారం!
స్పోర్ట్స్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా ఫైనల్కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకే ఆలౌటైంది.
గత ఏడాది వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియాను ఆస్ట్రేలియా ఓడించిన విషయం తెలిసిందే. ఇక అందుకు గాను భారత్ ప్రతీకారం తీర్చుకునేలా విజయం సాధించింది.
లక్ష్యఛేదనలో భారత బ్యాటర్లు అదరగొట్టారు. 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి భారత్ 265 పరుగులు చేసి విజయం సాధించింది.
విరాట్ కోహ్లీ (84; 98 బంతుల్లో 5 ఫోర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42*) జట్టుకు మంచి సహకారం అందించారు. హార్దిక్ పాండ్య (28), రోహిత్ శర్మ (28) కూడా రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 2 వికెట్లు తీసాడు.
భారత బౌలింగ్లో మహ్మద్ షమీ 3 వికెట్లు, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ కేరీ (61) ఆసీస్ తరఫున అర్ధ శతకాలు సాధించారు.
ఫైనల్ మ్యాచ్ మార్చి 9న దుబాయ్లో జరుగనుంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య బుధవారం జరిగే సెమీ ఫైనల్-2లో గెలిచిన జట్టు భారత్తో తలపడనుంది.