స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ నిష్క్రమించిన తర్వాత, ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా, నాజర్ హుస్సేన్, మైక్ ఆర్థర్టన్ వంటి మాజీలు భారత్ దుబాయ్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడడం అనుకూలంగా మారిందని వ్యాఖ్యానించారు.
అయితే, దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించారు. ఇంగ్లండ్ మాజీలు తమ జట్టు వైఫల్యాన్ని సమీక్షించుకోవాలని, భారత్ విజయాలపై అక్కసు వెళ్లగక్కడం అవసరం లేదని గవాస్కర్ హితవు పలికారు.
భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగడం భారత క్రికెట్ బోర్డు నిర్ణయం కాదని, భద్రతా కారణాల వల్ల ఐసీసీ తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేశారు.
‘‘మీ జట్టు ఎందుకు సెమీస్‌కు చేరుకోలేకపోయిందో ఆలోచించండి. భారత్ బలమైన జట్టుగా నిలిచింది, అందుకే ఫైనల్ దిశగా సాగుతోంది. మీ జట్టు ఆటగాళ్లు అనుకున్న స్థాయిలో ఆడకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది’’ అని గవాస్కర్ వ్యాఖ్యానించారు.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు భారత్ సేవ చేస్తున్న విధానాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ‘‘మీరు తీసుకుంటున్న శాలరీలు కూడా పరోక్షంగా భారత్ వల్లే వస్తున్నాయి. భారత మార్కెట్ వల్ల క్రికెట్ ప్రపంచం నిలుస్తోంది’’ అంటూ గవాస్కర్ చురకలు అంటించారు.
సెమీస్ రేసు ముగిసిన తర్వాత కూడా ఇంగ్లండ్ మాజీలు ఇలా వ్యాఖ్యలు చేయడం సరైన చర్య కాదని, వారి జట్టుపై దృష్టి పెట్టాలని గవాస్కర్ స్పష్టం చేశారు.