న్యూఢిల్లీ: భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పొరుగుదేశాలైన పాకిస్తాన్, చైనాలతో సరిహద్దు వివాదాలకు సంబంధించి భేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అవి యుద్ధాలకు కూడా దారితీశాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్తో నాలుగుసార్లు, చైనాతో ఒకసారి యుద్ధాలు జరిగాయి.
పాకిస్తాన్ వీలైనప్పుడల్లా సరిహద్దుల వద్ద చొరబాట్లకు పాల్పడుతూనే ఉండగా, మరోవైపు ఇటీవల చైనా సైతం చొరబాట్లకు పాల్పడుతోంది. పొరుగు దేశాల తీరు చూస్తే, ఏ నిమిషంలోనైనా యుద్ధం ముంచుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ యుద్ధమే గనుక ముంచుకొస్తే, ఎదుర్కోవడానికి భారత సైన్యం తగిన సన్నాహాలు చేసుకుంటోంది.
‘గాల్వన్’ సంఘటన తర్వాత ప్రభుత్వం సైన్యానికి ఎక్కడి నుంచైనా రూ.500 కోట్ల వరకు విలువ చేసే ఆయుధాలను కొనుగోలు చేసేందుకు సైన్యానికి ఆర్థిక అధికారాలు ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత సైన్యం అమెరికా నుంచి 72,400 అసాల్ట్ రైఫిళ్ల కోసం ఆర్డర్ ఇవ్వనుంది. గత ఏడాది మన సైన్యం అమెరికా నుంచి రూ.700 కోట్ల విలువ చేసే ఆయుధాలను కొనుగోలు చేసింది.
అమెరికా నుంచి కొత్తగా కొనాలనుకుంటున్న ‘సిగ్ సాయెర్’ అసాల్ట్ రైఫిళ్లు కూడా తమ చేతికి అందితే, భారత సైన్యానికి అవసరమైన 8 లక్షల రైఫిళ్ల అందినట్లు అవుతుందని ఉన్నతాధికారి ఒకరు ఇటీవల మీడియాకు వెల్లడించారు.
అయితే, వీలైనంత వరకు చర్చలతోనే సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో మరోసారి చైనాతో కమాండర్ స్థాయి అధికారుల చర్చలకు భారత సైన్యం సమాయత్తమవుతోంది. ఇప్పటి వరకు మూడుసార్లు ఈ స్థాయి చర్చలు జరిగాయి. దశలవారీగా ద్వైపాక్షిక సైనిక చర్చల ద్వారా సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికే భారత్ మొగ్గు చూపుతోంది. మరోవైపు పరిస్థితి అదుపు తప్పి, పొరుగు దేశం యుద్ధానికి తెగబడితే, ఎదుర్కోవడానికి కూడా సమాయత్తమవుతోంది.