ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాక్ నేత బిలావల్ భుట్టో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కఠినంగా స్పందిస్తూ, పాకిస్థాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు.
“సింధు మాది కాదంటే వారి రక్తం ప్రవహిస్తుంది” అన్న బిలావల్ మాటలకు పూరి గట్టి కౌంటర్ ఇచ్చారు. “నీళ్లే లేని పాక్ నేత దేంట్లో దూకుతాడు?” అంటూ విమర్శించారు. పాకిస్థాన్ తన చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
పహల్గామ్ దాడి ఉగ్రవాదానికి ప్రత్యక్ష ఉదాహరణ అని, ఇకపై భారత్ పాక్‌కు ఎలాంటి ఊరింపులు ఇవ్వదని పూరి చెప్పారు. ఉగ్రవాదం గురించి ప్రపంచం గుర్తించిందని, పాక్ అంతర్జాతీయంగా కూడా ఒంటరిపడుతోందని విమర్శించారు.
లండన్‌లో పాక్ హైకమిషన్ ఘటనను ప్రస్తావిస్తూ, ఇది ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికి నిదర్శనమని హర్దీప్ వ్యాఖ్యానించారు. పాక్ పతనానికి ఇది సూచన అని చెప్పారు.
సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం పాక్‌పై గట్టి ప్రభావం చూపుతుందని, భారత్ ఈ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయదని కేంద్ర మంత్రి హెచ్చరించారు.