ఓవల్: భారత్ ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్ పై గెలుపుతో టీమీండియా ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021-23 టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌తో ఆడుతున్న టెస్టు సిరీస్ నుంచి చూసుకుంటే భారత్ ఇప్పటికి రెండు విజయాలు, ఒక ఓటమి మరియు ఒక మ్యాచ్ డ్రాతో మొత్తంగా 54.17 శాతం పర్సంటైల్‌తో 26 పాయింట్లు సాధించింది.
కాగా భారత్ తరువాత లిస్ట్లో రెండో స్థానంలో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. ఓవరాల్‌గా ఒక గెలుపు, ఒక ఓటమితో 50 శాతం పర్సంటైల్‌తో 12 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలవగా, వెస్టిండీస్ 50 శాతం పర్సంటైల్‌తో 12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది.
అయితే పాయింట్ల పరంగా ఇంగ్లండ్ విండీస్, పాక్‌ల కంటే ఎక్కవగా ఉన్నప్పటికీ, టీమిండియాతో సిరీస్‌లో రెండు ఓటములు ఉండడంతో నాలుగో స్థానంలో ఉంది. ఓవరాల్‌గా ఒక గెలుపు, రెండు ఓటములు, ఒక డ్రాతో 29.17 శాతం పర్సంటైల్‌తో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక నాలుగో టెస్టులో 157 పరుగులతో అద్భుత విజయంతో 50 ఏళ్ల తర్వాత ఓవల్ మైదానంలో విజయాన్ని అందుకుంది.
1971లో అజిత్ వాడేకర్ నాయకత్వంలో విజయాన్ని అందుకున్న టీమిండియా, మరీ ఇన్నాళ్ల తరువాత విరాట్ కోహ్లి నాయకత్వంలో ఓవల్ మైదానంలో భారత్ విజయాన్ని సాధించింది. ఇక చివరిదైన ఐదో టెస్టు సెప్టెంబర్ 10 నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది.