స్పోర్ట్స్ డెస్క్: భారత అండర్-19 మహిళల క్రికెట్ జట్టు వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. మలేసియాలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.
మొత్తం జట్టుకు, సహాయక సిబ్బందికి కలిపి రూ.5 కోట్ల ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ విజయంలో తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది.
ఫైనల్‌లో 3 వికెట్లు తీసిన త్రిష, బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించింది. 33 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును విజయం వైపు నడిపించింది. మొత్తం టోర్నమెంట్‌లో 309 పరుగులతో పాటు 7 వికెట్లు తీసిన ఆమె ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మరియు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది.
టీమిండియా బౌలింగ్ విభాగంలో వైష్ణవి శర్మ 17 వికెట్లు, ఆయుశి శుక్లా 14 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్లను కట్టడి చేశారు. ఈ బౌలర్ల దెబ్బకు ఫైనల్‌లో సఫారీలు కేవలం 82 పరుగులకే ఆలౌటయ్యారు. అనంతరం భారత యువ బ్యాటర్లు నెమ్మదిగా లక్ష్యాన్ని చేరుకుని మరో వరల్డ్ కప్‌ను జట్టులో వేసుకున్నారు.
భారత యువ మహిళల ఈ అద్భుత ప్రదర్శనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బీసీసీఐ ప్రకటించిన నగదు బహుమతితో పాటు దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల మద్దతు కూడా పెరుగుతోంది.
ఈ ఘన విజయంపై ప్రధాని మోదీ సైతం ప్రత్యేకంగా స్పందించారు. భారత యువ క్రీడాకారిణుల ప్రతిభ ప్రపంచస్థాయిలో మరోసారి నిరూపితమైందని ప్రశంసించారు.