లండన్: టీమిండియా ఇంగ్లండ్ పై లార్డ్స్‌లో అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. రెండవ టెస్టులో చివరి రోజు భారత బౌలర్లు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. వెంటనే బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లను బెంబేలెత్తించారు. ఇంగ్లండ్‌కు షాకులు మీద షాక్‌లిచ్చారు. డ్రా అవ్వాల్సిన మ్యాచ్ ను గెలిచి అధ్బుతాన్ని సృష్టించారు. భారత్ రెండవ టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
కాగా భారత్ రెండవ ఇన్నింగ్స్ లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్‌ను మహమ్మద్ షమీ (70 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), మరియు బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) రెగులర్ బ్యాట్స్ మెన్ల లాగ పోరాడి ఆదుకోవడంతో భారత్ 109.3 ఓవర్లలో 8 వికెట్లకు 298 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 51.5 ఓవర్లలో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగియడానికి కేవలం 9.1 ఓవర్లు మిగిలిఉన్న సమయంలో ఇంగ్లండ్ చేతిలో 3 వికెట్లు ఉండటంతో ఈ మ్యాచ్ డ్రా అవుతుందని అందరూ భావించారు. ఆ సమయంలో రాబిన్సన్ (9)ను అవుట్ చేసి బుమ్రా విజయానికి బాట వేయగా, ఒకే ఓవర్లో బట్లర్ (25), అండర్సన్ (0)లను పెవిలియన్ పంపించి సిరాజ్ మ్యాచ్ ను విజయంతో ముగించాడు.
భారత్ ఈ గెలుపుతో మొత్తం ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యం సాధించింది. 4వ రోజు ఓవర్‌నైట్ స్కోరు 181/6తో సోమవారం ఆట ప్రారంభించిన తరువాత రిషభ్ పంత్ (22) ఎక్కువసేపు క్రీజులో నిలువలేక పోయాడు. ఇషాంత్ (16) త్వరగానే ఔటయ్యాడు. ఈ దశలో షమీ–బుమ్రా భాగస్వామ్యం అద్భుతాన్నే చేసింది.