అంతర్జాతీయం: భారత అంతరిక్ష చరిత్రలో మరో గర్వకారణమైన ఘట్టం రాబోతోంది. భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, మే 29న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించనున్నట్టు యాక్సియమ్ స్పేస్ ప్రకటించింది. ఇది నాసా-ఇస్రో సంయుక్త భాగస్వామ్యంతో రూపొందించిన ప్రైవేట్ అంతరిక్ష యాత్ర.
ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి, భారత కాలమానం ప్రకారం రాత్రి 10:33 గంటలకు స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా శుక్లా బృందం నింగిలోకి వెళ్ళనుంది. ఆయనతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన స్లావోస్జ్, హంగేరీకి చెందిన టిబోర్ పాల్గొంటున్నారు.
అంతరిక్ష కేంద్రంలో శుభాంశు శుక్లా సుమారు 14 రోజుల పాటు గడపనున్నారు. ఈ సమయంలో శాస్త్రీయ పరిశోధనలు, వాణిజ్య కార్యకలాపాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ, బయో-మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో కీలక పరిశోధనలు చేపడతారు.
ఈ మిషన్, ఇస్రో చేపడుతున్న గగన్‌యాన్ మిషన్‌కు మానవ సహిత ప్రయోగాలకు పునాదులు వేసేలా ఉంది. భవిష్యత్‌లో భారతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి కూడా ఇది మద్దతుగా నిలవనుంది.
భారత అంతరిక్ష ప్రయాణాల్లో శుభాంశు శుక్లా మరో మైలురాయిని అందుకోవడం గర్వించదగిన విషయం అని నిపుణులు భావిస్తున్నారు.