జాతీయం: దాదాపు 40 సంవత్సరాల విరామం తర్వాత భారతదేశం మరోసారి అంతరిక్షంలోకే అడుగుపెడుతోంది. వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు వెళ్లబోయే రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు.
1984లో రాకేష్ శర్మ అనంతరం, మళ్లీ ఓ భారతీయుడి అంతరిక్ష ప్రయాణానికి మార్గం దొరికింది. అమెరికా సంస్థలు నాసా, యాక్సియమ్ స్పేస్ సహకారంతో జరిగే ‘యాక్సియమ్-4’ మిషన్‌లో శుభాన్షు పైలట్‌గా ఎంపికయ్యారు.
ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 ద్వారా ఈ ప్రయాణం జరగనుంది. శుభాన్షు గత ఎనిమిది నెలలుగా అమెరికాలో కఠిన శిక్షణ పొందుతున్నారు.
ప్రయాణానికి భారత ప్రభుత్వం రూ. 500 కోట్లు ఖర్చుచేస్తోంది. ఈ బృందానికి నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ కమాండర్‌గా ఉండగా, పోలండ్‌కు చెందిన ఉజ్నాన్స్కి, హంగేరికి చెందిన టిబోర్ కపు మిషన్ స్పెషలిస్టులుగా ఉంటారు.
ఇస్రో చేపట్టబోయే గగన్‌యాన్ మిషన్‌కు శుభాన్షు ప్రయాణం ప్రాథమిక అడుగుగా మారనుంది. సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్ష జీవన అనుభవం పొందేందుకు ఇది దోహదపడుతుంది. శుభాన్షు శుక్లా వయసు కేవలం 40 సంవత్సరాలు కావడం విశేషం. ఈ ప్రయాణం భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది.