ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 1,235 పాయింట్ల నష్టంతో 75,838 వద్ద ముగియగా, నిఫ్టీ 299 పాయింట్ల పతనంతో 23,045 వద్ద స్థిరపడింది.
ఈ పతనంతో ఇన్వెస్టర్ల సంపదలో దాదాపు రూ.7 లక్షల కోట్ల మేరకు నష్టం జరిగిందని సమాచారం.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మెక్సికో, కెనడాలపై ట్రేడ్ టారిఫ్ విధిస్తామని, భారత్ సహా ఇతర దేశాలపై కూడా సుంకాలు విధిస్తామని ఆయన చేసిన ప్రకటన మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది.
ఈ నేపథ్యంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్, జొమాటో వంటి దిగ్గజ సంస్థల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
అమెరికాలో డాలర్ బాండ్ ఈల్డ్స్ పెరుగుతుండటంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్ నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు.
మరోవైపు, వచ్చే నెల 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ను ఎదురుచూస్తూ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఇన్వెస్టర్లు శ్రద్ధగా వ్యవహరించి, తమ పెట్టుబడులపై సమగ్రమైన అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.