న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం అదనంగా మరో 35 వేల సైనికులను మందిని చైనాతో ఉన్న సరిహద్దుల వెంబడి నియమించాలని నిర్ణయించింది. తూర్పు లద్దాఖ్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో చైనా తరచూ సరిహద్దు వివాదాలు సృష్టిస్తుండడం, ఇటీవల గల్వాన్ లోయలో పొరుగుదేశపు సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు వీరమరణం పొందడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.
గల్వాన్ దుర్ఘటన జరిగిన తరువాత ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఫలితమిచ్చే అవకాశం లేకపోవడం ఇంకో కారణం. భారత్-చైనా సరిహద్దులు 3,488 కిలోమీటర్ల పొడవు ఉండగా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దులను కాపాడుకునేందుకు భారత్ ఇప్పటికే భారీగా ఖర్చు పెడుతోంది. ‘వాస్తవాధీన రేఖ వెంబడి మరీ ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతంలో పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. రెండువైపులా అదనపు సైనిక బలగాలను మోహరిస్తున్నారు.
తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా దళాల ఉపసంహరణ ఇంకా పూర్తి కాలేదని భారత్ గురువారం స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, సైనిక దళాల ఉపసంహరణ అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి దాదాపు పూర్తయిందని చైనా రెండు రోజుల క్రితం ప్రకటించిన నేపథ్యంలో భారత్, అది నిజం కాదని ఈ స్పష్టత ఇచ్చింది.
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా సైన్యంతో పోరాడి, వీరమరణం పొందిన 20 మంది భారత అమరజవాన్ల పేర్లను ఢిల్లీలోని నేషనల్ వార్ మెమొరియల్‌పై లిఖించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పేర్లు చేర్చడానికి కొద్ది నెలల సమయం పట్టనున్నట్టు తెలిపారు.
గడచిన ఐదు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా జూన్ 15వ తేదీన గల్వాన్ లోయలో చైనా సైనికులతో భీకర పోరాటం జరిగింది. ఈ పోరాటంలో 16 బిహార్ రెజిమెంట్‌కి చెందిన కల్నల్ బి.సంతోష్ బాబుతో పాటు, 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణలో చైనా సైనికులు ఎంత మంది చనిపోయారనేది చైనా ప్రభుత్వం ప్రకటించలేదు. అమెరికా నిఘా వర్గాల ప్రకారం దాదాపు 35 మంది చైనా సైనికులు చనిపోయినట్టు సమాచారం.