చెన్నై: భారత క్రికెట్ జట్టు లో చోటు సంపాదించడం ఒక కల. అలంటి కలను నెరవేర్చుకొని దేశానికి అద్భుతమైన విజయాల్ని అందించిన క్రికెటర్లు ఒక వయసు వచ్చిన తర్వాత రిటైర్ అవ్వాల్సిందే. అప్పటివరకు రోజూ ప్రాక్టీస్ కి వెళ్లడం, ఆటలు ఆడడం మాత్రమే దిన చర్యగా ఉంటుంది. ఒక్కసారి రిటైర్ అయిన తర్వాత అంత నిశ్శబ్దం. దాదాపు చాలా మందికి రిటైర్మెంట్ అనేది ఒక యాభై ఏళ్ళ తర్వాత ఉంటుంది. కానీ క్రీడా రంగం, మిలిటరీ ఫోర్సెస్ కి దాదాపు ముప్ఫైల్లోనే రిటైర్మెంట్ ఉంటుంది. ఇలా కొందరు రిటైర్ అయిన తర్వాత వేరు వేరు రంగాలలో మెల్లిగా స్థిరపడతారు. ఇపుడు అదే ప్రయత్నాల్ని చేస్తున్నారు స్టార్ క్రికెటర్స్ హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్.
అనిల్ కుంబ్లే తర్వాత భారత స్పిన్ భారాన్ని మోసి జట్టుకు చాలా విజయాలు అందించిన హర్భజన్ సింగ్ తమిళ్ ఇండస్ట్రీ లో ఫ్రెండ్షిప్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ తో మరో హీరో గా నటిస్తున్నాడు ఈ మాజీ స్పిన్నర్. మరొక తమిళ్ సినిమాలో భారత పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ నటిస్తున్నాడు. విక్రమ్ నటిస్తున్న కోబ్రా సినిమాలో ఇంటర్పోల్ ఆఫీసర్ పాత్రలో విలన్ గా నటిస్తున్నాడు ఇర్ఫాన్. ఇదివరకే నవ్ జ్యోత్ సిద్దు లాంటి వాళ్ళు హోస్ట్ లుగా చేసారు, చాలా మంది మాజీ క్రికెటర్లు క్రికెట్ కామెంటరీ లోనే స్థిరపడ్డారు. ఇంకొందరు కోచ్ లుగా, గంభీర్ లాంటి వాళ్ళు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. సినీ రంగంలో కూడా ఒకప్పుడు బాలీవుడ్ లోనే నటించిన ఈ క్రికెట్ హీరోస్ సౌత్ మూవీస్ లో కూడా నటించడం ఆసక్తి కరమైన విషయం.