జాతీయం: భారత్‌లో తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం – భవిష్యత్తు రవాణాకు కీలక అడుగు
భారత రవాణా రంగంలో విప్లవాత్మక మార్పుకు దారితీసే హైపర్‌లూప్ టెక్నాలజీ దిశగా దేశం మరో ముందడుగు వేసింది. భూమి పై భాగంలోనే విమానాల వేగంతో ప్రయాణించగల హైపర్‌లూప్ ప్రయోగాలకు ఉద్దేశించిన తొలి టెస్ట్ ట్రాక్ విజయవంతంగా సిద్ధమైంది. ఈ టెస్ట్ ట్రాక్‌ను మద్రాస్ ఐఐటీ రైల్వే మంత్రిత్వశాఖ సహకారంతో అభివృద్ధి చేసింది.
ఈ హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ పొడవు 422 మీటర్లు. భవిష్యత్తులో ఇది పూర్తిస్థాయి కమర్షియల్ హైపర్‌లూప్ వ్యవస్థ అభివృద్ధికి కీలకంగా మారనుంది. ప్రస్తుతం ఈ రవాణా వ్యవస్థ పూర్తిగా అమలైతే, 350 కిలోమీటర్ల దూరాన్ని కేవలం అరగంటలో చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ టెస్ట్ ట్రాక్ అభివృద్ధి వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
ప్రభుత్వ-విద్యాసంస్థల భాగస్వామ్యంతో ముందుకు…
భవిష్యత్ రవాణా సాంకేతికతలో కొత్త మార్గాలను అన్వేషించేందుకు భారత ప్రభుత్వం, ప్రముఖ విద్యాసంస్థలు చేతులు కలిపాయి. ఈ ప్రాజెక్టుకు రైల్వే మంత్రిత్వశాఖ నిధులు కేటాయించింది. ఇప్పటికే రెండు విడతల్లో 20 లక్షల డాలర్ల గ్రాంట్‌ను మద్రాస్ ఐఐటీకి అందించింది. ఇకపై ఈ పరిశోధనను మరింత వేగంగా అభివృద్ధి చేసేందుకు మరో 10 లక్షల డాలర్లను కేటాయించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి తెలిపారు.
హైపర్‌లూప్ – ఐదో తరహా రవాణా వ్యవస్థ
హైపర్‌లూప్ సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా ఐదో తరహా రవాణా వ్యవస్థగా అభివర్ణిస్తున్నారు. ఇది అత్యాధునిక హైస్పీడ్ ప్రయాణానికి అనువుగా రూపొందించబడింది. ప్రధానంగా శూన్యంతో కూడిన గొట్టాల నుంచి ప్రయాణించే పాడ్‌లు దీనిలో ఉపయోగించబడతాయి. ఈ పాడ్‌లు ట్రాక్స్‌ను తాకకుండా, మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ ద్వారా గాల్లో తేలుతూ ప్రయాణిస్తాయి.
ఈ విధానం వలన రాపిడి, గాలి నిరోధం తగ్గిపోతుంది. ఫలితంగా, గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంటుంది. హైపర్‌లూప్ పరికల్పన పూర్తిగా అమలయితే, విమాన ప్రయాణాలనూ అధిగమించే వేగంతో ప్రయాణికులు గమ్యస్థానాలను చేరుకోవచ్చు.
భారత తొలి కమర్షియల్ హైపర్‌లూప్ లక్ష్యం
ఈ టెస్ట్ ట్రాక్ విజయవంతంగా పనిచేయడంతో త్వరలోనే తొలి వాణిజ్య హైపర్‌లూప్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు రైల్వేశాఖ యోచిస్తోంది. ప్రయాణ సమయాన్ని తగ్గించడంతోపాటు, అధునాతన సాంకేతికతను ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రపంచ స్థాయిలో హైపర్‌లూప్ టెక్నాలజీని అందిపుచ్చుకుని భారత్ రవాణా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించనుంది.