జాతీయం: భారత్ మోస్ట్ వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్రవాది ‘అర్ష్ దల్లా’ అరెస్టు!
భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న ఖలిస్థానీ ఉగ్రవాది అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష్ దల్లా ఎట్టకేలకు కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో కెనడాలో మిల్టన్ పట్టణంలో జరిగిన కాల్పుల ఘటనలో అర్ష్ దల్లా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల కేసులో అతని నేర సంబంధాలపై కెనడా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు మరియు పోలీసులు సంయుక్త దర్యాప్తు జరిపి, ఇటీవల అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అర్ష్ దల్లా ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌కు అత్యంత సన్నిహితుడిగా భావించబడుతున్నాడు. పంజాబ్‌లో అనేక నేరాలకు పాల్పడిన అతడు, కాంగ్రెస్ నేత బల్జీందర్ సింగ్ బల్లి హత్యకు కారకుడిగా ఉన్నాడు. తన తల్లి పోలీసు కస్టడీలో ఉండడానికి కాంగ్రెస్ నాయకుడు కారణమని భావించిన అర్ష్ దల్లా, ఈ హత్య జరిపినట్లు సమాచారం. ఇంతటితో ఆగకుండా అతడు పంజాబ్‌లో పలు నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. దీంతో భారత్ అతడిని మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది.
భారత్ – కెనడా సంబంధాలపై ప్రభావం
కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదుల ఉనికి గురించి ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించడం, భారత్-కెనడా సంబంధాలను మరింత ఉద్రిక్తం చేసింది. ఖలిస్థానీ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారత్ ప్రమేయం ఉందని ట్రూడో చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య దౌత్య వివాదాలకు దారితీశాయి. ట్రూడో ప్రభుత్వం ఖలిస్థానీ వేర్పాటువాదులకు కెనడాలో ఆశ్రయం కల్పిస్తోందని భారత్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. కెనడా మాత్రం ఖలిస్థానీలను తమ పౌరులుగా కాపాడుకుంటున్నామని, వారు చట్టపరంగా నడుచుకుంటున్నారని వెల్లడించింది.