శ్రీనగర్: భారత ఉత్తర భాగం అయిన జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై చేపట్టిన ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణం ఇవాళ్టితో పూర్తయ్యింది. ఆ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ ఆర్చ్ నిర్మాణం, కశ్మీర్ లోయను ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (యూఎస్‌బీఆర్ఎల్) ప్రాజెక్టుతో అనుసంధానం చేస్తుంది. 1.3 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జిని భారత్ ఉత్తర రైల్వేస్, రూ.1,486 కోట్ల వ్యయంతో చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
ఈ వంతెన ఎత్తు పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎత్తైనది, పైగా ఈ అధ్బుత నిర్మాణాన్ని ఏడాదిలోపే పూర్తి చేయడం విశేషం. కాగా ఈ సందర్భంగా నార్తర్న్ రైల్వే జనరల్ మేనేజర్ అశుతోష్ గంగాల్ మాట్లాడుతూ, భారతీయ రైల్వే చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక గొప్ప రోజు అని పేర్కొన్నారు.
భారతీయ రైల్వే చరిత్రలో ఇలాంటి రైల్వే నిర్మాణం ఇప్పటి దాకా ఎక్కడా, ఎప్పుడూ జరగలేదని, గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు, అత్యంత తీవ్రతతో సంభవించే భూకంపాలను సైతం ఈ నిర్మాణం తట్టుకో గలదని తెలిపారు. కాగా, కేబుల్ క్రేన్ ద్వారా ఆర్చ్ సెగ్మెంట్‌ను అమర్చడాన్ని కేంద్ర రైల్వే మంత్రి పియుష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా వీక్షించారు.