బాలి: ఇండోనేషియాలో మరో సారి భూకంపం సంభవించింది. సడన్ గా భూకంపం సంభవించడంతో అక్కడి స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటనతో కొండ చరియలు కూడా విరిగిపడ్డాయి. అక్కడక్కడ కొన్ని భవనాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. కాగా ఈ భూకంపం వల్ల ఆరుగురు మృతి చెందారు.
ఘటన జరిగిన ప్రాంతం పర్యాటక ప్రాంతం అయిన బాలికి కొద్ది కిలోమీటర్ల దూరంలో జరిగింది. కాగా ప్రకంపనలు సముద్ర గర్భంలో రావడంతో అందరూ సునామీ వచ్చే అవకాశం ఉందని భయపడ్డారు. అలాంటి ముప్పు అయితే ఏమీ లేదని అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఒక ఏజెన్సీ ధ్రువీకరించింది.
ఇండినేషియాకు సమీపంలోని ద్వీపకల్పం బాలి, జావా సమీపంలో సముద్ర గర్భాన శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భూ ప్రకంపనలు చెలరేగాయి. రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదైందని అక్కడి అధికారి రహ్మత్ ట్రియోరీ తెలిపారు. ఈ ధాటికి ద్వీపకల్పంలోని కొన్ని భవనాలు కూలిపోయాయి. దీంతో ఆరుగురు మృతి చెందారు. తూర్పు జావాకు 82 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భాన ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు.