ఒక చిన్న గదిలో మొదలు పెట్టిన వ్యవసాయం లక్షలు సంపాదించి పెడుతోంది!
ప్రతిభ, ఏదన్నా సాధించాలనే పట్టుదల ఉంటే చిన్న స్థలం, సాదా పద్ధతులు కూడా సరిపోతాయి అనటానికి నవీన్, ప్రవీణ్ అనే అన్నదమ్ముల విజయగాథ చక్కని ఉదాహరణ. వీరు ఇంట్లోని చిన్న గదిలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన మసాలా అయిన కుంకుమ పువ్వు సాగు చేసి భారీ లాభాలు ఆర్జిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఎంటెక్ పూర్తి చేసిన ప్రవీణ్, హోటల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ అయిన నవీన్ సొంత కాళ్ళమీద నిలబడి, ఎక్కువగా సంపాదించాలి అనే తమ కలను సాకారం చేసుకోవాలని నిశ్చయించారు.
వారి ఆలోచన కుంకుమ పువ్వు సాగు. ఇందుకోసం ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో అధికారిక శిక్షణ పొందిన తర్వాత, కశ్మీర్ నుంచి అత్యున్నత ప్రమాణాల కుంకుమ పువ్వు విత్తనాలు తీసుకొని, ప్రత్యేక శిక్షణతో తక్కువ స్థలంలో ఆహ్లాదకర వాతావరణంలో సాగు మొదలుపెట్టారు. సూర్యకాంతి అవసరం లేకుండా, ఎల్‌ఈడీ లైట్లతో 10-20 డిగ్రీల ఉష్ణోగ్రతలో కృత్రిమంగా వాతావరణం కల్పించి ఏరోపోనిక్ పద్ధతిలో పంటను పండించారు.
సొంత కష్టంతో కేవలం 13 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన ఈ ప్రయాణంలో తొలి ఏడాది కిలోన్నర కుంకుమ పువ్వును పండించి, కేజీని రూ.5 లక్షలకు విక్రయించారు. మార్కెట్లో ప్రీమియం కుంకుమ పువ్వుకు ఉన్న డిమాండ్‌ని తమకు అనుకూలంగా మార్చుకున్న వీరి కృషి, తెలివితేటలూ ఇప్పుడు లక్షలు సంపాదించి పెడుతున్నాయి.