న్యూఢిల్లీ: భారత దేశంలో అత్యంత స్వచ్ఛమైన నగగాల జాబితాలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ఈసారి కూడా తొలి స్థానం దక్కించుకుంది. దేశంలోనే తొలి స్వఛ్ఛ నగరంగా ఇండోర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం ఇది అయిదవ సారి.
కాగా రెండవ స్థానంలో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్, మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నిలిచాయి. ఇదిలా ఉండగా దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా జార్ఖండ్ మొదటి స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్-2021’ అవార్డులను శనివారం ప్రకటించింది.
ఈ అవార్డులను గెలిచిన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. ఇండోర్ సాధించిన విజయానికి గాను నగర ప్రజలకు ఆ జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. ‘ఇండోర్ నగరాన్ని దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా ఐదవసారి నిలిపినందుకు ఇండోర్ వాసులకు అభినందనలు అని తెలిపారు.
పౌరులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం వల్లే ఇది సాధ్యమైంది’ అని కలెక్టర్ మనీష్ సింగ్ ట్వీట్ చేశారు. అంతేగాక ఇంతకుముందు దేశంలోనే తొలి వాటర్ ప్లస్ నగరంగా ఇండోర్ నిలిచింది. ఇదిలా ఉండగా స్వచ్ఛ్ సర్వేక్షణ్ అనేది ‘స్వచ్ఛ భారత్ మిషన్’లో భాగంగా దేశంలోని నగరాలు, పట్టణాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి సంబంధించి నిర్వహించే ఒక వార్షిక సర్వే.