ఇన్ఫోసిస్ 400 మందికిపైగా ట్రైనీ ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించడంపై కేంద్ర కార్మికశాఖ తీవ్రంగా స్పందించింది. ఉద్యోగుల సంక్షేమ సంఘం (NITES) చేసిన ఫిర్యాదు నేపథ్యంలో, ఈ సంఘటనపై కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాసింది. ఉద్యోగులను అర్థంతరంగా తొలగించడం సరికాదని, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
తొలగింపునకు గురైన ఉద్యోగులను రాత్రివేళ సెక్యూరిటీ సిబ్బందితో క్యాంపస్ బయటకు పంపించేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. హాస్టల్‌లో ఒక్క రాత్రి ఉండేందుకు అనుమతించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీనిపై స్పందించిన ఇన్ఫోసిస్, ఉద్యోగ నియామక విధానాన్ని సమర్థించుకుంది. మైసూర్ క్యాంపస్‌లో శిక్షణ పొందిన తర్వాత ఇంటర్నల్ పరీక్షల్లో ఉత్తీర్ణత అవసరమని, మూడు అవకాశాలు ఇచ్చినప్పటికీ విఫలమైన వారిని కొనసాగించలేమని సంస్థ స్పష్టం చేసింది.
ఇదే సమయంలో, ఇన్ఫోసిస్ చర్యలు అనైతికమని NITES తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్యోగుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది.
ఈ వ్యవహారం ఉద్యోగ నియామకాలపై దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. కార్మిక నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్మికశాఖ తేల్చిచెప్పింది.