టెక్ న్యూస్: ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి ఉద్యోగుల తొలగింపులతో వార్తల్లో నిలిచింది. శిక్షణలో ఉన్న 240 మంది ట్రైనీలను పనితీరు తక్కువగా ఉండడంతో ఉద్యోగాల నుంచి తొలగించినట్టు కంపెనీ వెల్లడించింది. ఏప్రిల్ 18న ఈమెయిల్ ద్వారా ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇలాంటిదే జరగగా, తాజా చర్యతో మళ్లీ ఐటీ రంగం దిశగా దృష్టి మరలింది. జనరిక్ ఫౌండేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో కనీస అర్హత సాధించలేకపోవడమే కారణమని స్పష్టం చేసింది.
మూడు అవకాశాలూ ఇచ్చినప్పటికీ మెరుగుదల కనపర్చలేదని పేర్కొంది. అయితే, కంపెనీ కొన్ని ఉపశమన చర్యలు కూడా ప్రకటించింది. ఒక్క నెల వేతనం ఎక్స్‌గ్రేషియా, రీలీవింగ్ లెటర్‌తో పాటు, అప్‌గ్రాడ్, ఎన్‌ఐఐటీ సహకారంతో ఉచిత శిక్షణ కార్యక్రమాలు అందించనుంది.
అలాగే, ట్రావెల్ అలవెన్స్, మైసూర్ ఎంప్లాయీ కేర్ సెంటర్ వసతి, కౌన్సెలింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. వచ్చే వారం కొత్త బ్యాచ్ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మిగిలిన ట్రైనీల్లో ఆందోళన నెలకొంది.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం ఖర్చులను తగ్గించుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు సహజమవుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.