హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యే రాష్ట్ర విద్యాశాఖ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను ప్రకటించింది. కాగా ఈ ప్రకటించిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగ ప్రకటిస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ఇవాళ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విద్యాశాఖ మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిలయిన విద్యార్థులందరిని కనీస శాతం(35శాతం) మార్కులతో పాస్ చేస్తున్నట్లు ఆమె ప్రెస్ మీట్ లో తెలిపారు. అందరిని పాస్ చేయడం ఇదే చివరి సారి అని, ఇక భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ఉండవని ఆమె స్పష్టం చేశారు.
కోవిడ్ మహమ్మారి తో విద్యా వ్యవస్థ చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. కోవిడ్ సంక్షభం కారణంగా మూడో తరగతి నుంచి పీజీ వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాం. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించాం. అన్ని అంశాలు ఆలోచించిన తర్వాతే పరీక్షలు పెట్టాం అని అన్నారు.
కాగా ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 49 శాతం మంది విద్యార్థులు పాసవ్వగా, మిగిలిన 51 శాతం మంది ఫెయిలయ్యారు. ఫెయిలయిన వారిలో ఎక్కువగా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో చదివిన విద్యార్థులే ఉన్నారు. అయితే ఈ ఫస్టియర్ ఫలితాలపై ప్రభుత్వాన్ని, మరియు ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం సరికాదు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు అలవాటైపోయింది అని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.