టాలీవుడ్: ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు కొన్ని సినిమాలు విడుదల అయ్యి కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి వెళ్తాయి. అలాంటి సినిమాలు ఆడనీ.. ఆడకపోనీ.. కానీ ఆ సినిమా చూసిన వాళ్ళకి మాత్రం ఒక మంచి అనుభూతి మిగిల్చేలా ఉంటాయి. జానర్ కి సంబంధం లేకుండా అలాంటి సినిమాలు వస్తూ పోతూ ఉంటాయి. ప్రస్తుతం ‘అర్థ శతాబ్దం’ అనే ఒక సినిమా కూడా అలాంటి కోవకే చెందుతుందని ఈరోజు విడుదలైన టీజర్ ని చూస్తే అర్ధం అవుతుంది. ‘అర్ధ శతాబ్దం’- ‘ది డెమోక్రటిక్ వయొలెన్స్’ అనే టైటిల్ మరియు టాగ్ తోనే సినిమా పైన సగం ఆసక్తి క్రియేట్ చేయగలిగారు మేకర్స్.
‘న్యాయం ధర్మం అవుతుంది కానీ ధర్మం ఎప్పుడూ న్యాయం కాదు’ అనే డైలాగ్ తో టీజర్ ఆరంభం అవుతుంది. ‘యుద్ధమే ధర్మం కానప్పుడు ధర్మ యుద్దాలు ఎక్కడివి..?’, ‘ఈ స్వతంత్ర దేశంలో గణతంత్రం ఎవడికో.. ఎందుకో.. దేనికో..?’ అంటూ వినిపించే డైలాగ్స్ ఈ సినిమా పై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. టీజర్ లో చూపించిన సన్నివేశాలు, న్యాయ శాస్త్రం పుస్తకం పై రక్తం తో నిండిన కత్తి పడెయ్యడాలు లాంటి కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి.
రవీంద్ర పుల్లే అనే నూతన దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వీర్ ధాత్మిక్ సమర్పణలో రిషిత శ్రీ క్రియేషన్స్ మరియు 24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్ పతకాలపై చిట్టి కిరణ్ రామోజు ,టి.రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కేరాఫ్ కంచరపాలెం నటుడు ‘కార్తిక్ రత్నం’, నవీన్ చంద్ర ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరిన్ని ముఖ్య పాత్రల్లో శుభలేఖ సుధాకర్, సాయి కుమార్, అజయ్, సుహాస్ నటించారు.