తిరుపతి: ఫైళ్ల దహనం కేసులో విచారణ వేగవంతం
సబ్‌కలెక్టరేట్ ఘటనపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం
అన్నమయ్య జిల్లా మదనపల్లె (Madanapalle) సబ్‌కలెక్టరేట్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఫైళ్ల దహనం ఘటనపై సీఐడీ (CID) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వంకరెడ్డి మాధవరెడ్డిని నిన్న గురువారం పోలీసులు అరెస్ట్ చేసారు.
తిరుపతిలో విచారణ
మాధవరెడ్డిని తిరుపతి (Tirupati) సీఐడీ కార్యాలయానికి తరలించి విచారణ జరుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయనను చిత్తూరు (Chittoor) కోర్టులో హాజరుపరచనున్నారు. విచారణలో ఆయన పాత్రపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
పరారీలో నిందితుడు
పోలీసుల కథనం ప్రకారం, ఫైళ్ల దహనం కేసు నమోదైన అనంతరం మాధవరెడ్డి పరారీలోకి వెళ్లారు. సీఐడీ అధికారులు మదనపల్లెలోని ఆయన నివాసం వద్ద నిఘా పెట్టినప్పటికీ పట్టుకోలేకపోయారు. చివరకు చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు వద్ద ఆయన ఫాం హౌస్‌లో ఉన్నట్లు సమాచారం లభించింది. దాడి నిర్వహించి మాధవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన కుట్రదారుగా మాధవరెడ్డి?
సబ్‌కలెక్టరేట్ దహనం కేసులో మాధవరెడ్డి ప్రధాన కుట్రదారుడిగా ఉన్నారని సీఐడీ అనుమానిస్తోంది. ఈ ఘటనలో కుట్ర, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, ఆధారాల మాయం వంటి కేసులు చేర్చే అవకాశముందని సమాచారం.