ఢిల్లీ: ఇంతవరకు జరిగిన ఐపీఎల్ వర్షన్స్ లో అన్నింటికన్నా ఐపీఎల్-2020 హైలైట్‌గా నిలుస్తుందని మాజీ క్రికెటర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నారు. ఈ సీజన్ ఐపీఎల్‌లో ఏ జట్టు టైటిల్ సాధిస్తుంది, ఏ ఆటగాడు బాగా ఆటతాడు అనేది అంతగా ప్రాధాన్యం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
దేశమే కాదు యావత్ ప్రపంచమంతా కరోనా భయాలు నెలకొన్న నేపథ్యంలో జరుగుతున్న ముఖ్యమైన క్రికెట్ వేడుక కాబట్టి వేదిక ఎక్కడైనా జోష్ ఏ మాత్రం తగ్గదని అన్నారు. ఇక ఐపీఎల్-2020 దుబాయిలో నిర్వహించడం కూడా కలిసి వస్తుందని చెప్పారు. యూఏఈ క్రికెట్ టోర్నీలకు అద్బుతమైన వేదిక అని పేర్కొన్నారు. ఈ సీజన్ జాతి మూడ్‌ను మారుస్తుందని గంభీర్ ఆకాక్షించారు.
ఇప్పటికే మార్చి 29న నిర్వహించాల్సిన ఐపీఎల్-2020 కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడటంతో, ఆ సమమాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు తాజా ఐపీఎల్ కొనసాగనుంది. ఐపీఎల్-2020 ని యూఏఈలో నిర్వహిస్తామని ఐపీఎల్ నిర్వహణ కమిటీ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ఇదివరకే ప్రకటించారు. టోర్నీకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు. కాగా, గంభీర్ సారథ్యంలో కోల్‌కత నైట్ రైడర్స్ రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ సాధించింది.