స్పోర్ట్స్ డెస్క్: విశాఖపట్నంలో జరగనున్న ఐపీఎల్ 2025 మ్యాచ్‌లకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. టికెట్ల విక్రయాలు ప్రారంభమైన క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. దీంతో టికెట్ల కోసం ఎదురుచూసిన పలువురు క్రికెట్ ప్రేమికులు నిరాశ చెందారు.
ఈ నెల 24న ఢిల్లీ క్యాపిటల్స్ – లక్నో సూపర్ జెయింట్స్, 30న ఢిల్లీ – హైదరాబాద్ జట్ల మధ్య విశాఖలో మ్యాచ్‌లు జరగనున్నాయి. నిన్న సాయంత్రం 4 గంటలకు మొదలైన టికెట్ల సేల్ కేవలం కొన్ని నిమిషాల్లోనే పూర్తయింది. రూ. 1000 టికెట్లకు భారీ డిమాండ్ కనిపించింది.
ఐపీఎల్ మ్యాచ్‌లకు విశాఖలో ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. గతేడాది కూడా ఇదే పరిస్థితి కనిపించింది. టికెట్లకు ఉన్న డిమాండ్ కారణంగా నకిలీ టికెట్ల మోసం జరగొచ్చనే ఉద్దేశంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
నకిలీ టికెట్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ సీపీ శంఖబత్ర బాగ్చీ హెచ్చరించారు. ఎవరైనా మోసపోతే 79950 95799 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఇప్పటికి 30న జరగనున్న ఢిల్లీ-హైదరాబాద్ మ్యాచ్ టికెట్ల విక్రయం ఎప్పుడు ప్రారంభమవుతుందనేది తెలియరాలేదు. అభిమానులు త్వరలోనే అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.