ముంబై: ఈ సారి ఐపీఎల్ మెగా వేలం ప్రత్యేకంగా సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఇది ఒక పెద్ద సర్ప్రైజ్. మొత్తం 1574 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేయగా, అందులో 1165 మంది భారతీయులు, 409 మంది విదేశీయులు ఉన్నారు.
ఈసారి వేలంలో ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో ఎన్నో ఆసక్తికర మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంతకుముందు తమ జట్లకు నాయకత్వం వహించిన రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లను రిటైన్ చేసుకోకపోవడం ముఖ్యాంశంగా మారింది.
వీరు కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించుకుని వేలంలో పాల్గొంటున్నారు. వీరి సరసన రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీ వంటి అనుభవజ్ఞులూ ఉన్నారు. పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లు మాత్రం రూ.75 లక్షల బేస్ ధరతో పాల్గొనడం విశేషం.
ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఈ సారి తొలిసారి ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్నారు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన అండర్సన్ రూ.1.25 కోట్ల కనీస ధరతో ఈ వేలంలో చేరారు. అలాగే మిచెల్ స్టార్క్ రూ.2 కోట్ల బేస్ ధరతో వేదికపై ఉన్నారు. ఈసారి మెగా వేలం అత్యంత ఆసక్తికరంగా మారబోతోంది, ఎందుకంటే అనేకమంది క్రికెట్ స్టార్లు తమ విలువను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు.