ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2020కి టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ మొబైల్ సంస్థ ‘వివో’ ప్రధాన స్పాన్సర్‌గా తప్పుకుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం అధికారికంగా ప్రకటించింది.
‘వివో’ లీగ్‌నుంచి తప్పుకున్నట్లు రెండు రోజుల క్రితమే దాదాపు ఖరారైపోగా, బోర్డు ఇప్పుడు తమ వైపునుంచి నిర్ధారిస్తూ ప్రకటన జారీ చేసింది. ‘2020 ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ, వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి’ అంటూ ఒక స్టేట్ మెంట్ లో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఐపీఎల్ స్పాన్సర్ గా ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించే విధంగా ‘వివో’ బీసీసీఐతో ఒప్పందం ఉంది. వివో తప్పుకోవడంలో భారతీయుల మనోభావాలతో పాటు ఆర్థిక పరమైన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితుల్లో తాము ఈ సారి రూ. 440 కోట్లు చెల్లించలేమని, కనీసం సగం మొత్తాన్ని తగ్గించాలంటూ వివో కొన్నాళ్ల క్రితం నుంచి బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తోంది.
దీనికి బోర్డు ఒప్పుకోలేదు. ఇప్పుడు ‘వివో’ తప్పుకోవడంతో పలు ప్రముఖ సంస్థలు స్పాన్సర్‌షిప్ కోసం ముందుకు వస్తున్నట్లు సమాచారం. వేర్వేరు కారణాలతో ఈసారి అంత భారీ మొత్తం లేకపోయినా, కొంత తక్కువగా చెల్లించి స్పాన్సర్‌గా వ్యవహరించాలని ప్రధానంగా మూడు సంస్థలు ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
మొదటగా వినిపిస్తున్న పేరు ‘బైజూస్’. ఈ సంస్థ ఇప్పటికే భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఆ భాగస్వామ్యం కారణంగా బైజూస్‌కు మొదటి ప్రాధాన్యత దక్కవచ్చని సమాచారం. కరోనా నేపథ్యంలో పెరిగిన ఆన్‌లైన్ తరగతుల కారణంగా అత్యంత ఆర్జన పొందిన సంస్థల్లో ఒకటిగా బైజూస్ నిలిచింది. టీమిండియాలాగే బీసీసీఐకి చెందిన మెగా ఈవెంట్‌తో కూడా జత కట్టాలని ఆ కంపెనీ కోరుకుంటోంది.
బైజూస్‌కు ప్రధానంగా భారతీయ కంపెనీ ‘జియో’నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రస్తుతం ఎదురు లేకుండా అన్ని విధాలా దూసుకుపోతున్న జియోకు స్పాన్సర్‌షిప్ రూ 440 కోట్ల మొత్తం ఏ మాత్రం సమస్య కాకపోవచ్చు. ఐపీఎల్‌లో ఇప్పటికే సగం జట్లకు అసోసియేట్ స్పాన్సర్‌గా ‘జియో’ వ్యవహరిస్తోంది కాబట్టి లీగ్ కు కొత్తేమి కాదు. మరి ఎవరు దీన్ని సాధిస్తారో వేచి చూడాలి.