హైదరాబాద్: ఐపీఎల్ క్రేజ్ ఉప్పల్ స్టేడియాన్ని కుదిపేస్తోంది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోయే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలన్న ఉత్సాహంతో అభిమానులు పెద్ద ఎత్తున టికెట్ల కోసం పోటీపడ్డారు.
టికెట్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా విడుదల చేసిన వెంటనే అన్ని అమ్ముడుపోవడంతో పలువురు నిరాశకు గురయ్యారు. ఈ స్థితిని కొందరు కేటుగాళ్లు లాభంగా మలుచుకుంటున్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న నేపథ్యంలో టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తూ దొరికిపోయారు.
శనివారం ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద టికెట్లను అధిక ధరలకు అమ్ముతున్న ఒక యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి నాలుగు టికెట్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
ఐపీఎల్ మ్యాచ్ కోసం ప్రజల్లో పెరుగుతున్న ఉత్సాహంతో పాటు, బ్లాక్ టికెట్ల విపణి కూడా అంతే వేగంగా విస్తరిస్తోంది. పోలీసులు బ్లాక్ మార్కెట్ పై నిఘా పెట్టినట్లు తెలిపారు. టికెట్లను అధిక ధరలకు కొనుగోలు చేయకుండా అభిమానులు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.