న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 కోసం మెగా వేలం నిర్వహించనున్న నేపథ్యంలో మొత్తం 1214 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 590 మంది క్రికెటర్లు వేలానికి షార్ట్‌లిస్ట్ అయినట్లు బీసీసీఐ ఇవాళ ప్రకటించింది.
ఆ 590 మందిలో 228 మంది ఆటగాళ్ళు క్యాప్డ్ ప్లేయర్లు కాగా, 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. కాగా భారత్ నుండి శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, అజింక్య రహానే, సురేశ్ రైనా, యజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ తదితర స్టార్ ప్లేయర్లు రేసులో ఉన్నారు.
అఫ్గనిస్తాన్ నుండి 17, ఆస్ట్రేలియా నుంచి 47, బంగ్లాదేశ్ నుంచి 5, ఇంగ్లండ్ నుంచి 24, ఐర్లాండ్ నుంచి 5, న్యూజిలాండ్ నుంచి 24, దక్షిణాఫ్రికా నుంచి 33, శ్రీలంక నుంచి 23, వెస్టిండీస్ నుంచి 34, జింబాబ్వే నుంచి ఒకరు, నమీబియా నుంచి ముగ్గురు, నేపాల్ నుంచి ఒకరు, స్కాట్లాండ్ నుంచి ఇద్దరు, అమెరికా నుంచి ఒకరు వేలంలో పాల్గొననున్నారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటన విడుదల చేశారు.
మెగా వేలం నేపథ్యంలో 48 మంది తమ కనీస ధరను 2 కోట్లుగా పేర్కొనగా, 20 మంది ఒకటిన్నర కోటి, 34 మంది ఒక కోటి రూపాయలను తమ బేస్ ప్రైస్‌గా పేర్కొన్నారు. కాగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.