ఇంటర్నేషనల్ డెస్క్: ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను గమనిస్తోంది. చిన్న దేశమైన ఇజ్రాయెల్, తనకన్నా పెద్దదైన ఇరాన్ తో యుద్ధానికి సిద్ధపడింది. ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మరో ప్రధాన అంశంగా మారింది. రెండు దేశాల మధ్య శత్రుత్వం ఎప్పటినుంచో ఉన్నా, ఈసారి ప్రత్యక్ష దాడులకు దిగడం గమనార్హం. ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో, ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సైనిక, ఆయుధ బలాల విషయాల్లో ఎవరిది పైచేయి అనేది ఆసక్తికరంగా మారింది.
ఇరాన్ సైనిక బలం ప్రపంచ ర్యాంకింగ్‌లో 14వ స్థానంలో ఉండగా, ఇజ్రాయెల్ 17వ స్థానంలో ఉంది. అయితే సైనిక సంఖ్య, ఆయుధ సంపత్తి, మరియు సాంకేతిక సామర్ధ్యం వంటి అంశాలు కూడా యుద్ధంలో కీలకంగా ఉంటాయి.
ఆయుధ సామర్ధ్యం:
ఇరాన్ దగ్గర సెజిల్ (2,500 కి.మీ), ఖైబర్ (2,000 కి.మీ) వంటి దీర్ఘశ్రేణి క్షిపణులు ఉన్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ దగ్గర జెరికో-3 (5,000 కి.మీ) వంటి శక్తివంతమైన క్షిపణులు ఉన్నాయి.
ఇరాన్ నౌకాదళం 101 యుద్ధ నౌకలు కలిగి ఉండగా, ఇజ్రాయెల్ 67 మాత్రమే కలిగి ఉంది. అయితే ఇజ్రాయెల్ దగ్గర ఖండాంతర అస్త్రాలు ఉండటం కీలకం.
డ్రోన్, రక్షణ వ్యవస్థలు:
ఇరాన్ వద్ద శక్తివంతమైన మొహజెర్-10 డ్రోన్ వ్యవస్థ ఉంది, కానీ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న పేట్రియాట్, ఐరన్ డోమ్ వంటి ఆధునాతన రక్షణ వ్యవస్థలు చాలా అడ్వాన్స్డ్.
అణ్వాయుధ సామర్ధ్యం:
ఇజ్రాయెల్ వద్ద 90 అణుబాంబులు ఉండగా, ఇరాన్ వద్ద హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ఉంది. దీనివల్ల ఇరాన్ కూడా ప్రభావం చూపగలుగుతుంది.
సైనిక సంఖ్య:
ఇరాన్ మొత్తం 6.1 లక్షల సైనికులను కలిగి ఉండగా, ఇజ్రాయెల్ 1.7 లక్షల సైనికులు మాత్రమే కలిగి ఉంది. అయితే రిజర్వ్ దళాల్లో ఇజ్రాయెల్ 4.65 లక్షలు, ఇరాన్ 3.5 లక్షలు ఉన్నాయి.
వాహనాలు, ట్యాంకులు:
ఇరాన్ దగ్గర 1,966 యుద్ధ ట్యాంకులు, 65,765 సాయుధ వాహనాలు ఉన్నాయి. అదే ఇజ్రాయెల్ దగ్గర 1,370 ట్యాంకులు, 43,407 వాహనాలు ఉన్నాయి. టోవ్డ్ ఆర్టిలరీ విషయంలో ఇరాన్ పైచేయి ఉండగా, వాయుసేన విషయంలో ఇజ్రాయెల్ ఆధిక్యంలో ఉంది. ఇజ్రాయెల్ 612 యుద్ధ విమానాలు కలిగి ఉండగా, ఇరాన్ 551 మాత్రమే కలిగి ఉంది.
యుద్ధంలో కీలక అంశాలు:
జనాభా పరంగా చూస్తే ఇజ్రాయెల్ 90 లక్షల జనాభా కలిగి ఉండగా, ఇరాన్ 8.75 కోట్ల జనాభాను రక్షించుకోవాలి. తక్కువ జనాభా ఉన్నా, ఇజ్రాయెల్ సాంకేతికంగా బలంగా ఉండటంతో పాటు అమెరికా మద్దతు ఉంది. ఇది ఇజ్రాయెల్‌కు అనుకూలంగా మారవచ్చు.
ప్రస్తుత యుద్ధ పరిస్థితులు ఏ దిశగా మారతాయో, ఇతర దేశాలు ఏ మేరకు మద్దతు ఇస్తాయో అనేది మరింత ఆందోళనకర అంశంగా ఉంది.