మూవీడెస్క్: నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న(HI NANNA) చిత్రం మంచి విజయాన్ని సాధించి, ప్రేక్షకుల మనసులను దోచుకుంది.
తండ్రీకుమార్తెల అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా మలిచిన ఈ సినిమాకు యువ దర్శకుడు శౌర్యువ్ మెరుగైన కథ అందించారని ప్రశంసలు వచ్చాయి.
మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, థియేటర్స్ లోనే కాదు, ఓటీటీలో కూడా మంచి స్పందన అందుకుంది.
అయితే, తాజాగా కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య, హాయ్ నాన్న తమ కన్నడ సినిమా భీమసేన నలమహారాజ (BHEEMASENA NALAMAHARAJA) ఆధారంగా తీశారని ఆరోపించారు.
రీమేక్ హక్కులు కొనుగోలు చేయకుండా కాపీ చేసారని, ఇది చట్టపరంగా సరైనదేనా అని ప్రశ్నించారు.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ, “ఇలాంటి నీచమైన పనులు ఎందుకు చేస్తున్నారు?” అంటూ మేకర్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అయితే, భీమసేన నలమహారాజ 2020లో నేరుగా ఓటీటీలో విడుదలై, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.
కార్తీక్ సర్గూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రక్షిత్ శెట్టితో కలిసి పుష్కర నిర్మించారు.
కథా పరంగా హాయ్ నాన్నతో కొంతమేరకు పోలికలు ఉన్నా, పూర్తిగా రీమేక్ అనడం తగదని నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు.
మరి ఈ ఆరోపణలపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.
రీమేక్ హక్కులు లేకుండా కథ తీసుకున్నారా? లేక ఇది కేవలం అనుమానం మాత్రమేనా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
హాయ్ నాన్న మేకర్స్ త్వరలోనే అధికారికంగా స్పందించే అవకాశం ఉందని టాక్.