అమరావతి: సీఎంగా ఉంటూ అబద్ధాలు చెప్పడం ధర్మమా?- జగన్మోహన్ రెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేవనెత్తిన తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ, “సీఎంగా ఉంటూ అబద్ధాలు చెప్పడం ధర్మమా? దేవుడిని రాజకీయాలకు వాడుకోవాలన్న దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుదే” అని ఆక్షేపించారు. ప్రజలకు చేసిన వాగ్దానాలను విస్మరించడాన్ని కప్పిపుచ్చేందుకు ఈ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు సంక్షేమ పథకాల అమల్లో వైఫల్యం, వరదల్లో నిర్లక్ష్యం వంటి కీలకమైన అంశాలను దాచిపెట్టి, నెయ్యి కల్తీ అంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు 100 రోజుల్లో మోసాలు:
జగన్ చంద్రబాబు 100 రోజుల్లో చేసిన పాలనను ఉద్దేశిస్తూ తీవ్రమైన విమర్శలు చేశారు. “పాలన అంటే అబద్ధాల మూట కాకూడదు” అంటూ ఆయన ఎద్దేవా చేశారు. సర్కారు తమను మంచి ప్రభుత్వం అనిపించుకునేందుకు కేవలం స్టిక్కర్లతో చూపులు మాయ చేస్తున్నారని, వాస్తవానికి ప్రజలు తీవ్రంగా నిరాశపడ్డారని ఆరోపించారు. 100 రోజుల్లో ఏ విధమైన అభివృద్ధి జరగలేదని, అన్ని రంగాలు వెనక్కి వెళ్లిపోయాయని జగన్ విమర్శించారు. పిల్లలు ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, 108 సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. ఇదే సమయంలో ఆరోగ్య ఆసరా వంటి పథకాలు పట్టించుకునే నాధుడు లేరని, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రైతుల సమస్యలపై జగన్ ఆగ్రహం:
రైతులు పూర్తిగా రోడ్డున పడ్డారని, రైతు భరోసా, పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా వంటి పథకాలు వర్క్ అవుట్ కాలేదని జగన్ మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నంత కాలం చంద్రబాబు రైతులకు ఏ విధమైన సహాయం చేయకపోవడంతో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక రైతులకు అందుబాటులో ఉన్న అన్ని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
తిరుమల లడ్డూ వివాదం:
తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, నెయ్యి సరఫరా వ్యవహారం లోపభూయిష్టం కాదని జగన్ ఖండించారు. నెయ్యి సరఫరా చేసే ప్రతీ ట్యాంకర్‌ను నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబొరేటరీస్ (NABL) సర్టిఫై చేసిన సంస్థల నుంచి పరీక్షలు చేయించి క్వాలిటీ సర్టిఫికేషన్ తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రతి ఆరునెలలకు ఆన్‌లైన్‌లో టెండర్లు పిలుస్తారని, నెయ్యి ప్రమాణాలను మూడు సార్లు పరీక్షించి, పాస్ అయిన తరువాతే లడ్డూ తయారీలో ఉపయోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన ఆరోపణలు మకిలిని అని అన్నారు.
చంద్రబాబు రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు:
జగన్ చంద్రబాబు లడ్డూ వివాదంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం ఎంత నీచమైన చర్య అని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలను కించపరచడానికి చంద్రబాబు అబద్ధాలను అల్లారని, ప్రజలను తప్పుదోవ పట్టించడంలో ఆయన ప్రయత్నం క్షమించరానిదని విమర్శించారు. ప్రజలు చంద్రబాబుకు కఠినమైన ప్రశ్నలు వేస్తున్నారని, ఈ లడ్డూ వివాదం ఆయన దుర్మార్గ ఆలోచన అని జగన్ ఆరోపించారు. నెయ్యి కల్తీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 16 సార్లు ట్యాంకర్లు తిరిగి పంపించారని, వైసీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లు తిరిగి పంపించడం జరిగిందని ఆయన గుర్తుచేశారు.
వైసీపీ హయాంలో విప్లవాత్మక మార్పులు:
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, లడ్డూ తయారీలో నాణ్యత పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని జగన్ చెప్పారు. ల్యాబ్‌లను మెరుగుపర్చామని, లడ్డూ తయారీకి సంబంధించిన అన్ని ప్రక్రియలు పారదర్శకంగా జరుగుతున్నాయని వివరించారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల్లో ప్రభుత్వ ప్రమేయం లేదని, వైవీ సుబ్బారెడ్డి 45 సార్లు అయ్యప్పమాల వేసుకున్న గొప్ప భక్తుడని కొనియాడారు. చంద్రబాబు లడ్డూ వివాదాన్ని కట్టుకథగా అల్లారని, తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
జగన్ చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. టీటీడీ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి, చంద్రబాబుకు యాక్షన్ తీసుకోవాలని కోరతామని తెలిపారు. చంద్రబాబు చేస్తున్న కట్టుకథల వెనుక దుర్మార్గ రాజకీయాలు ఉన్నాయని జగన్ విమర్శించారు.