అమరావతి: తగునా అన్న నీకు? – షర్మిల ఆవేదన
వైఎస్ షర్మిల తన సోదరుడు, జగన్‌మోహన్ రెడ్డి పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంపాదించిన ఆస్తుల్లో తనకు, తన పిల్లలకు దక్కాల్సిన వాటా ఇవ్వకుండా, అన్యాయం చేసినట్లు మండిపడ్డారు. ఆస్తుల పంపకానికి సంబంధించి తాము చేసుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కి, అరకొర ఆస్తులిచ్చి పంపించివేయాలని ప్రయత్నిస్తున్నారని షర్మిల ఆరోపించారు.
జగన్ కేవలం తల్లిపైనా కాకుండా, చెల్లిపైనా కేసులు పెట్టి కుటుంబాన్ని కోర్టు వద్దకి తీసుకెళ్లేంత వరకు వెళ్లారంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల పంపకంపై తనతో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయకుండా, తనకు షరతులు పెట్టడం ద్వారా మరింత అన్యాయం చేస్తున్నారని ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.
నాన్న ఇచ్చిన మాటను గాలికి వదిలేశారని ఆరోపణ
తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన సొంత సంపాదనను నాలుగు మనవలు, మనవరాళ్లకు సమానంగా పంచాలని ఆదేశించిన విషయాన్ని గుర్తుచేసిన షర్మిల, ఆ ఆదేశాలను జగన్ అంగీకరించినప్పటికీ, తండ్రి మరణం తర్వాత మాట తప్పి, ఆస్తులను తనకే పరిమితం చేసుకున్నారని ఆరోపించారు. భారతి సిమెంట్స్, సాక్షి పత్రికలతో సహా రాజశేఖరరెడ్డి సంపాదించిన ఆస్తుల్లో జగన్ మెజారిటీ వాటాలు ఉంచుకుని, తమకు అరకొర ఆస్తులు మాత్రమే ఇచ్చి పంపించివేయాలని చూస్తున్నారని ఆమె అన్నారు.
తల్లిపైనా కేసులు వేస్తారా?
ఆస్తుల పంపకం విషయంలో కుటుంబానికి చెందిన ఒక ఒప్పందాన్ని అమలు చేయకుండా, తన తల్లిపైనా కేసులు పెట్టి, దారుణంగా వ్యవహరిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. జగన్ తన మాట నిలబెట్టుకోవాలని, తండ్రి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని కోరుతూ, లేదంటే చట్టపరమైన మార్గాల్లో వెళ్లే ఉద్దేశం ఉన్నట్లు ఆమె హెచ్చరించారు.
రాజకీయాలు, ఆస్తులు విడివిడిగా చూడాలి
తన రాజకీయ జీవితం గురించి నిర్ణయాలు తీసుకునే అధికారం జగన్‌కు లేదని షర్మిల తేల్చి చెప్పారు. తనకు ఉండాల్సిన ఆస్తులు ఇవ్వకుండా, సెటిల్‌మెంట్ చేసేందుకు రాజకీయ జీవితం మీద షరతు పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు.
సరస్వతి పవర్ షేర్లు వివాదం
ఎంఓయూ ప్రకారం తనకు సరస్వతి పవర్ షేర్లు ఇవ్వాలని ఒప్పందం ఉన్నప్పటికీ, ఇప్పటికీ ఆ హామీని జగన్ నెరవేర్చలేదని షర్మిల ఆరోపించారు. తన తల్లి విజయమ్మకు ఆ షేర్లు ఇవ్వాల్సిన హక్కులు ఉన్నప్పటికీ, అవి ఇవ్వకుండా కుట్ర పన్నుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.