ఆంధ్రప్రదేశ్: విజయసాయి రెడ్డి రాజీనామా రాజకీయ వ్యూహమా?
లండన్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భవిష్యత్తు గురించి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చి 30 ఏళ్లు పాలన సాగిస్తానంటూ తన రాజకీయ భవితవ్యంపై ఊదరగొట్టారు. అయితే, అదే సమావేశంలో తన విశ్వసనీయత గురించి మాట్లాడటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమా? లేకపోతే అనాలోచితమా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
విజయసాయి కౌంటర్ – జగన్‌కు ఎదురుదెబ్బ?
జగన్ విశ్వసనీయత గురించి మాట్లాడిన వెంటనే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చిరకాల అనుబంధం కలిగిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. అంతేకాక, మోపిదేవి వెంకటరమణ కూడా జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అక్రమ ఆస్తుల కేసుల్లో జగన్‌తో కలిసి 16 నెలలు రిమాండ్ ఖైదుగా ఉన్న విజయసాయి, ఇంతకాలం ఆయన వెన్నంటే ఉన్నా, రాజీనామా చేసిన తర్వాత ఒక్క మాట కూడా ఆయనపై మాట్లాడలేదు. కానీ, ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యక్షంగా స్పందించటం ఆసక్తికరంగా మారింది.
షర్మిల సంచలన ఆరోపణలు – జగన్‌పై మరింత ఒత్తిడి?
ఈ పరిణామాల మధ్య, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం విజయసాయిరెడ్డి వ్యవహారంపై స్పందించారు. మీడియా ముందుకొచ్చిన ఆమె, జగన్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం విజయసాయిని తీవ్రంగా టార్చర్ పెట్టారని ఆరోపించారు. జగన్ తన సొంత కుటుంబ సభ్యులనూ దూరం చేసుకున్నారని, మేనకోడలు, మేనల్లుడు ఆస్తులను కాజేయాలని కుట్రలు చేశారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
షర్మిల–విజయసాయి భేటీ వెనుక సీక్రెట్ ఏంటి?
రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన విజయసాయిరెడ్డి ఇటీవల షర్మిల నివాసంలో మూడు గంటల పాటు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. షర్మిలతో విజయసాయి ఏం చర్చించారన్నది వైసీపీ శ్రేణుల్లో ఆందోళన రేపుతోంది. ముఖ్యంగా, జగన్‌పై ఆయనకు ఎంత సమాచారం ఉందన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.
జగన్–విజయసాయి మధ్య విబేధాలు మరింత ముదరతాయా?
ఇప్పటికే పార్టీ నుంచి అనేక కీలక నేతలు వైదొలిగిన నేపథ్యంలో, విజయసాయిరెడ్డి వంటి సీనియర్ నేత జగన్‌కు బహిరంగంగా వ్యతిరేకంగా స్పందించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ ఇప్పుడు తనే పార్టీని గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నా, సమీప అనుచరులు ఒక్కొక్కరుగా దూరమవుతున్న తీరును చూస్తే, ఆయన నేతృత్వంలో విస్తృత అసంతృప్తి ఉందని స్పష్టమవుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో, విజయసాయి నిజంగా జగన్‌కు ఎదురుతిరగబోతున్నారా? లేకపోతే ఇది కేవలం ఒక రాజకీయ వ్యూహమా? అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.