ఎనాలిసిస్ డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఇటీవల తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం వంటి చర్యలు పార్టీ భవిష్యత్తుపై పలు ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం రాజకీయ పరంగా అనుకూలం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయం – ఐదేళ్లూ వెళ్ళారా?
ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడాన్ని సాకుగా చూపుతూ, అసెంబ్లీకి వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం కేవలం జగన్‌కి మాత్రమే కాకుండా, ఆయన పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలకు కూడా వర్తింపచేశారు. దీంతో వచ్చే ఐదేళ్ల పాటు ఈ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటుందా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
పరిపాలనలో ఎమ్మెల్యేల ప్రధాన బాధ్యత ప్రజా సమస్యలను చట్టసభల ఎదుట తీసుకురావడం. కానీ, మూడుసార్లు వరుసగా అసెంబ్లీలో హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయడానికి స్పీకర్‌కు అధికారాలు ఉన్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో పాల్గొనకపోవడం ద్వారా వైసీపీ తన సాకారతను కోల్పోకుండా ఉండగలదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయం లో, జగన్ సొంత చెల్లెలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వున్న షర్మిల సైతం తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని విస్మరిస్తూ రాజ్యాంగబద్ధ పదవుల్లో కొనసాగడం నేరమని, చేతకానితనమని అంటూ, ఎమ్మెల్లే పదవికి రాజీనామా చెయ్యమని వత్తిడి చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరం – పలాయన వ్యూహమా?
ఇటీవల నాలుగు జిల్లాల పరిధిలోని పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ పోటీకి దూరంగా ఉండటానికి నిర్ణయించింది. అధికారంలో ఉన్నప్పుడు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో సైతం పోటీ చేసిన వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనకపోవడాన్ని రాజకీయ విశ్లేషకులు ఆత్మహత్యాసదృశమైన చర్యగా అభివర్ణిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టభద్రుల నుంచి మద్దతు లభించలేదని, ఇప్పుడు పోటీకి దూరంగా ఉండటం మేలనిపిస్తుందని భావించిన వైసీపీ, ఈ నిర్ణయం ద్వారా పార్టీ పలాయన మంత్రం జపిస్తున్నట్టు ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
స్థానిక ఎన్నికల్లో వైసీపీ స్థానం ఎలా?
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ ఎలా పోటీ చేయగలదన్న సందేహాలు వ్యాప్తి చెందుతున్నాయి. గతంలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలో ఉండగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని విజయాలు సాధించింది. కానీ, ప్రస్తుతం టీడీపీ స్థానిక ఎన్నికల్లో అదే వ్యూహాన్ని అనుసరిస్తే? ఆ ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోతే ప్రతిపక్ష పార్టీగా వైసీపీ తన ప్రాధాన్యతను పూర్తిగా కోల్పోతుందన్న భావన ఏర్పడుతోంది.
వ్యూహాత్మక నిర్ణయాలు – భవిష్యత్తు ప్రణాళికలకు ప్రభావం
రాజకీయ పార్టీలకు ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రాధాన్యతను కాపాడుకోవడం అత్యవసరం. రాజకీయ పోరాటంలో పార్టీకి ప్రజలు మద్దతుగా ఉండాలంటే ఎన్నికల్లో పాల్గొనడం, అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలను చర్చించడం అనివార్యం. వైసీపీ తీసుకున్న తాజా నిర్ణయాలు రాజకీయంగా అలోచనీయమైనవిగా మారాయి. ఈ వ్యూహాత్మక చర్యల వల్ల పార్టీ భవిష్యత్తు ప్రణాళికలు, ప్రజాదరణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.