న్యూఢిల్లీ: అఈటీ కంపెనీలు కరోనా నేపథ్యంలో ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని ఇచ్చాయి. కాగా తాజాగా ఈ వర్క్‌ఫ్రం హోంని కొనసాగించే విషయమై ఒక్కో కంపెనీ ఒక్కో నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి. తమ ఉద్యోగులు ఎక్కడి నుంచి పని చేయాలి అనే విషయమై స్పష్టతను ఇస్తున్నాయి. తాజాగా దీనిపై నంబర్ వన్ సెర్చ్ ఇంజన్ గూగుల్, టాటా కంసల్టన్సీ సర్వీసెస్ సైతం స్పందించాయి.
గూగుల్:
ప్రపంచం మొత్తం మీద కరోనా కేసులు తగ్గుతున్నట్లు కనిపిస్తోన్నా మళ్ళీ ఎదో ఒక కొత్త రకం వేరియంట్లతో ప్రమాదం తెస్తూనే ఉంది. అమెరికాతో పాటు చాలా దేశాల్లో డెల్టా వేరియంట్‌తో రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీని వల్ల తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మనే విషయంలో గూగుల్ వెనకడుగు వేసింది. 2022 జనవరి తర్వాత వరకు తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం కొనసాగించాలని తాజాగా నిర్ణయించింది. ఆఫీసులకు వచ్చి పని చేయాలనే నిబంధను ఉద్యోగుల ఐచ్ఛికానికే వదిలేసింది.
ఇదిలా ఉండగా అయితే భారత్‌కు చెందిన కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసులకు రప్పించే ఆలోచన చేయడం ఇక్కడ గమనార్హం. ఈ జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), దాదాపు పద్దెనిమిది నెలల తర్వాత ‘వర్క్ ఫ్రమ్ హోం’ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని కోరుతోంది. టీసీఎస్‌కు యాభై దేశాల్లో 250 లొకేషన్లలో ఆఫీసులు ఉన్నాయి.
టీసీఎస్ లో దాదాపు ఐదు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో భారతదేశంలో పనిచేసే ఉద్యోగుల్లో 90 శాతం మంది కనీసం ఒక్కడోసు వేయించుకున్నారు. అంతేకాక ఎంప్లాయిస్ ఫీడ్‌బ్యాక్ సర్వేలో సగం మందికిపైగా తిరిగి ఆఫీసులకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారట. అందుకే ఆఫీసులకు రావాలని కోరుతున్నామని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్‌జీ సుబ్రమణియం చెబుతున్నారు.