అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు సమీపంలో మూడు ప్రాంతాలలో మూడు ఐటీ కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మూడు చోట్ల కనీసం 2 వేల ఎకరాల చొప్పున ఇవి ఏర్పాటయ్యేలా అడుగులు ముందుకు వేయాలని చెప్పారు.
రానున్న మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించాల్సిన అవసరం చాలా ఉందని, ఆ లక్ష్య సాధనతో పనులు ముందుకు సాగాలన్నారు. ఈ సదుపాయాల వల్ల రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి ఎంతగానో దోహద పడుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధి, ఈ రంగాల పాలసీ ఎలా ఉండాలనే అంశంపై శుక్రవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీలో ఉండాల్సిన అంశాలపై అధికారులకు ఈ సందర్భంగా మార్గనిర్దేశం చేశారు. అన్ని సదుపాయాలు, అత్యున్నత ప్రమాణాలతో కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్నెట్ నెట్‌వర్క్ బలంగా లేకపోతే, అనుకున్న లక్ష్యాలు సాధించలేమని వివరించారు.
కోవిడ్ లాంటి మహమ్మారి నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం శాతం బాగా పెరిగింది. ఇకపై కూడా దీనిని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఏరకంగా ఐటీ రంగానికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందిస్తామో పరిశీలించి, దాన్ని పాలసీలో పెట్టాలి.
గ్రామంలోని సచివాలయాలు, ఆర్బీకేలు అన్నీ ఇంటర్నెట్‌తో అనుసంధానం కావాలి. దీంతో పాటు అవసరమైన గృహాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి. వైఎస్సార్ జిల్లాలోని కొప్పర్తి ఎలక్ట్రానిక్ పార్క్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఈ పార్కులోకి వీలైనన్ని పరిశ్రమలను తీసుకురావాలి. తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పించడంపై అధికారులు దృష్టి పెట్టాలి.