అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ రాజుపై సీఐడీ కస్టడీలో హత్యాయత్నం, చిత్రహింసలు జరిగాయన్న కేసులో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. అప్పటి సీఐ, ఎస్సై, ఇతర సిబ్బంది తమ వాంగ్మూలంలో ఈ హింసలకు సంబంధించిన నిజాలను వెల్లడించారు. సీఐడీ కస్టడీలో రఘురామకృష్ణరాజుపై చిత్రహింసలు పెట్టామని వారు అంగీకరించారు. అంతేకాకుండా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొట్టారని కూడా వాంగ్మూలంలో వివరించారు.
అప్పటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌కు రఘురామను కొట్టడం ప్రత్యక్షంగా వీడియో తీసి చూపించామని సిబ్బంది పేర్కొన్నారు. అయితే కొట్టడం అలాకాదని సునీల్‌కుమార్ చెప్పి కాల్ కట్ చేసి, ఆ తర్వాత మిగతా మరో నలుగురు ముసుగు ధరించిన సిబ్బందితో కలిసి వచ్చి మరింత హింసకు పాల్పడ్డారని వివరించారు. రఘురామ రాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న వాదన కూడా ఈ వాంగ్మూలంలో భాగమైంది.
గుంటూరు పోలీసులు సీఐడీ సిబ్బందిని విచారించి ఈ విషయాలను పక్కాగా సేకరించారు. సునీల్‌కుమార్ సమక్షంలో ఈ హింసలు జరిగినట్టు నిరూపించడానికి గూగుల్ టేక్‌అవుట్ ద్వారా ఆయన సెల్‌ఫోన్ లొకేషన్ కూడా సేకరించారని సమాచారం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో రఘురామకృష్ణరాజు సీఐడీ పోలీసులపై ఫిర్యాదు చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం, అప్పటి సీఎం వైఎస్ జగన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు సీఐడీ పోలీసులు తనపై రాజద్రోహం కేసు పెట్టి తనపై హత్యకు కుట్రపన్ని చిత్రహింసలకు గురిచేశారని, తర్వాత జైలుకు తరలించారని పేర్కొన్నారు.
ఫిర్యాదులో అప్పటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విజయపాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి, అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డిలను నిందితులుగా చేర్చి వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని కోరారు.