న్యూఢిల్లీ: భారత కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 25వ తేదీన డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పేరుతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2021 అనే కొత్త నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ నిబంధనలు అమలైతే ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు దేశంలో చిక్కులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ కొత్త నిబంధనల ప్రకారం వివాదాస్పద మెసేజ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు వాటి మూలాలను పూర్తిగా వెల్లడించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రాం వంటి ఇతర మెసేజింగ్ సంస్థలు తప్పని సరిగా పాటించాలి. ఈ కొత్త నిబంధనల వల్ల మెసేజ్‌లకు ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉందని చెబుతున్న వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రాం వంటి సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారాయి.
ఈ నూతన నిబంధనల ప్రకారం వివాదాస్పద మెసేజ్ మొదటి ఎవరి నుంచి వచ్చిందో కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే ఓ ట్వీట్ లేదా మెసేజ్ భారత్ నుంచి పోస్ట్ కాలేదని వెల్లడైతే, అప్పుడు భారత్‌లో దాన్ని ముందుగా ఎవరు రిసీవ్ చేసుకున్నారో సదరు యాప్ తప్పనిసరిగా వెల్లడించాలని నూతన నిబంధనలను ప్రకటిస్తూ కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
ఇంతకు ముందు ఒక మెసేజ్ మూలాలను వెల్లడించాలని వాట్సాప్‌ను ప్రభుత్వం కోరగా ఇది తమ ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతకు విరుద్ధమని మెసేజింగ్ యాప్ ఆ వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది. ఇక నూతన ఐటీ నిబంధనలు అమలైతే వాట్సాప్ విధిగా ప్రభుత్వం అడిగిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేల ఈ కొత్త నిబంధనలు పాటించకపోతే వాట్సాప్‌తో పాటు ఇతర మెసేజింగ్ సంస్థలను బ్యాన్ చేసే అవకాశం ఉంది.