అమరావతి: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఐటీ హై ఎండ్ స్కిల్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ నిపుణులు, ఐటీ ప్రొఫెషనల్స్ కొరత ఉంటుందని, దాన్ని తీర్చడానికి ఈ యూనివర్సిటీ ఊపయోగపడుతుందని అన్నారు .
టైర్–1 నగరాల్లో ఇలాంటి నిపుణుల కొరత ఉత్పన్నం కాదు కాబట్టి సమస్యలుండవని, టైర్–2 నగరాల్లో వీరిని తయారు చెయ్యడానికి ప్రత్యేక శిక్షణ చాలా అవసరమని ఆయన తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రొబోటిక్స్ వంటి అత్యాధునిక అంశాల్లో అక్కడ శిక్షణ ఇవ్వాలని అన్నారు. ఐటీ విధానంపై ముఖ్యమంత్రి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యంతోపాటు ఐటీ, పరిశ్రమల శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.