వాషింగ్టన్: ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాటిక్ సభ్యురాలు కమల హారిస్‌పై మరో సారి నోరుపారేసుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి ఆమె అసలు పోటీదారే కాదన్నారు. ఆమెతో పోల్చితే ఇవాంక ట్రంప్ బెటర్ చాయిస్ అని అభిప్రాయపడ్డారు. శుక్రవారం న్యూ హాంప్‌షైర్‌లో జరిగిన రిపబ్లికన్ ప్రచార ర్యాలీలో తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ, ‘ఒక మహిళ అమెరికా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను.
అందుకు మద్దతు కూడా తెలుపుతున్నాను. అయితే ఆ పదవికి కమలా హారిస్ ఏ మాత్రం అర్హురాలు కాదు, పోటీదారు అంతకన్నా కాదు. వైట్ హౌస్ సీనియర్ సలహాదారు అయిన ఇవాంక ట్రంప్ అయితే చాలా బాగుంటుంది’ అని అన్నారు. ట్రంప్ మద్దతుదారులు కూడా ఇవాంక అని అరవడంతో ‘ఇది ప్రజల కోరిక.. నా తప్పు లేదు’ అన్నారు ట్రంప్. రిపబ్లికన్ పార్టీ తరఫున రెండో సారి అధ్యక్ష పదవికి నామినేట్ అయిన తర్వాత నిర్వహించిన తొలి ర్యాలీలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే హారిస్ ఎన్నికల ప్రచారాన్ని బాగా బలంగానే ప్రారంభించినా, కొద్ది నెలల్లోనే ఆమె తమ మద్దతుదారులను కోల్పోతుందన్నారు. అప్పుడు ఆమె అధ్యక్ష పదవి రేసు నుంచి ఖచ్చితంగా తప్పుకుంటుంది అని తెలిపారు. హారిస్‌కు అస్సలు ఓట్లు రావని విమర్శించారు ట్రంప్. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు అధికారాన్ని అప్పగిస్తే అమెరికన్లు కన్న కలలన్నీ కల్లలుగానే మిగిలిపోతాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా గొప్పతనాన్ని నాశనం చేయడంతో పాటుగా ప్రజలకెవరికీ ఉద్యోగాలు కూడా ఉండవని ఈ సందర్భంగా ట్రంప్ విమర్శించారు.