అమరావతి: జగన్, షర్మిల ఆస్తుల వివాదం ముగింపు దశకు?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఉన్న ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదం చర్చనీయాంశంగా మారింది. సోదరుడు, సోదరి మధ్య ఆస్తుల పంపకాలపై కొన్నాళ్లుగా కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు ముగింపుకు చేరుకోవడమే కాకుండా, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారితీసింది.
జగన్ తరచూ బెంగళూరుకు వెళ్లి, ఈ విషయంపై దృష్టిపెట్టారని వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ వివాదం సమసిపోయే దశకు చేరుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇటువంటి పరిణామంలో షర్మిల వ్యవహార శైలి కూడా గత రెండు నెలలుగా మారిపోయింది.
గతంలో జగన్, వైసీపీపై తీవ్రంగా విమర్శలు చేసిన షర్మిల.. ఇప్పుడు మౌనంగా ఉంటూ, ప్రధానంగా కూటమి సర్కారు పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో, ఆస్తుల వివాదం పరిష్కారానికి షర్మిల మౌనం సంబంధించిందా అని రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఏడాది ఎన్నికల ముందు, షర్మిల జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. బాబాయి వివేకానంద రెడ్డి హత్యతో పాటు, వైసీపీ మోసం చేసిందని, జగన్ తనను వాడేసి వదిలేశారని కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రజలు ఆమె మాటలను నమ్మారు, జగన్ పాలనపై ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఓటమికి కారణమై ఉంటాయనే చర్చ సాగింది.
ఇప్పుడు ఈ అనూహ్య పరిణామంలో షర్మిల ఆస్తుల వివాదంపై యూటర్న్ తీసుకుంటే, ఆమె రాజకీయ ఇమేజ్‌కు పెద్ద దెబ్బ తగులుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఆస్తుల కోసమే షర్మిల రాజకీయం చేస్తున్నారని, జగన్‌ను విమర్శించారని ప్రచారం బలపడితే, ఆమె పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.