కడప: ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తన అన్న, వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా దక్కించుకోలేని జగన్, అసెంబ్లీకి కూడా హాజరుకాకపోవడం సిగ్గుచేటని అన్నారు.
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో జగన్, ఎంపీ అవినాశ్ రెడ్డిల పాత్ర నిష్క్రియంగా ఉందని మండిపడ్డారు. కడపలో మీడియాతో మాట్లాడిన షర్మిల, వైఎస్సార్ హయాంలో స్టీల్ ప్లాంట్ ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు జరిగాయని గుర్తు చేశారు.
అయితే జగన్ 2019లో అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ ప్రాజెక్టు వృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మూడు సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తానని జగన్ ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు.
అవినాశ్ రెడ్డి పదేళ్లుగా ఎంపీగా ఉన్నా, పార్లమెంటులో కడప స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఎత్తి చూపలేకపోయారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం శంకుస్థాపనలకే పరిమితమై, ప్రతిసారి టెంకాయలు కొట్టే ప్రాజెక్టుగా మారిందని ఎద్దేవా చేశారు. కడప ప్రజలు ఇలాంటి నాయకులను ఎన్నుకోవాలా అని ప్రశ్నించారు.
షర్మిల మాట్లాడుతూ, ప్రజల భవిష్యత్తును మార్చే ప్రాజెక్టులపై వైసీపీ నేతలు బాధ్యతగా పనిచేయాలని, అందులో విఫలమైతే ప్రజలు వారిని సరైన బుద్ధి చెప్పాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.