ఏపీ: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి సామాన్యులకు సీట్లు ఇస్తున్నానని గర్వంగా చెప్పుకున్నారు. ముఖ్యంగా, గత ఎన్నికల్లో శింగనమల అసెంబ్లీ స్థానం లారీ డ్రైవర్‌కు కేటాయించి ప్రజల్లో పాజిటివ్ మెసేజ్ ఇచ్చారు.
అయితే, ఇప్పుడు ఆ సీటు మళ్లీ సామాన్యుడికి దక్కే అవకాశమే లేకుండా పోయినట్టుగా కనిపిస్తోంది. బడా రాజకీయ నాయకుడు శైలజానాథ్ వైసీపీలో చేరడంతో శింగనమల సీటు ఆయన్నే దక్కుతుందన్న ప్రచారం మొదలైంది.
కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా పనిచేసిన శైలజానాథ్ ఇటీవల వైసీపీలో చేరారు. జగన్ స్వయంగా తాడేపల్లిలో ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన శైలజానాథ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.
రఘువీరా రెడ్డితో కూడా ఆయనకు మంచి అనుబంధం ఉంది. అయితే, పార్టీకి మైలేజీ తీసుకురాగలిగే నేతగా మాత్రం శైలజానాథ్ పేరు పెద్దగా వినిపించలేదు.
ఇప్పటికే జగన్ సామాన్యులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో లారీ డ్రైవర్‌కు శింగనమల సీటు ఇచ్చారు. కానీ, శైలజానాథ్ రాకతో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
మరి, జగన్ మళ్లీ సామాన్యుడికి అవకాశమిస్తారా? లేక శైలజానాథ్‌కే టికెట్ కేటాయిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదంతా చూస్తుంటే, వైసీపీలో సామాన్యులకు అవకాశం దక్కే పరిస్థితి లేదనే విమర్శలు మళ్లీ వినిపిస్తున్నాయి. ఓటమి తర్వాత జగన్ పార్టీని పునర్వ్యవస్థీకరించుకుంటున్న క్రమంలో కొత్త నేతలకు అవకాశం ఇస్తూ, పాత వారికి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారా? అనే చర్చ కూడా రాజుకుంది.