అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ‘వైఎస్సార్ బీమా’ పథకాన్ని బుధవారం ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రీమియం మొత్తం జమ చేస్తామని, వారం రోజుల్లో ఖాతాలకు అవి చేరుతాయని తెలిపారు. ఈ పథకంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉండాలని స్పష్టం చేశారు.
‘జగనన్న తోడు’ పథకాన్ని నవంబరు 6న ప్రారంభిస్తామని, బ్యాంకర్లతో మాట్లాడి దరఖాస్తు దారులందరికీ రుణాలు మంజూరు చేయించాలని కలెక్టర్లు, జేసీలను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ పథకాల అమలు తేదీలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి జగన్ అన్నింటిలోనూ కలెక్టర్లు, జేసీలు కీలకపాత్ర పోషించాలని కోరారు.
బీమా ప్రయోజనాలు:
► బియ్యం కార్డులు కలిగిన కుటుంబాలు వైఎస్సార్ బీమా పథకానికి అర్హులు. 18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండి కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తిస్తుంది.
► 18 – 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న లబ్ధిదారుడు సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు చొప్పున బీమా పరిహారం చెల్లిస్తారు. లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు పూర్తి అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు బీమా పరిహారం అందిస్తారు.
► 51 – 70 ఏళ్ల మధ్య వయసు లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.3 లక్షలు పరిహారం లభిస్తుంది. శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.3 లక్షలు బీమా పరిహారం అందుతుంది. 18 – 70 సంవత్సరాల వయసు గల లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు పాక్షిక/ శాశ్వత అంగ వైకల్యానికి గురైతే రూ.1.50 లక్షల బీమా పరిహారం అందిస్తారు.