అమరావతి: నియోజకవర్గాల పునర్విభజనపై (డీలిమిటేషన్) దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు.
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం కోల్పోతాయని, ఇది తీవ్ర అన్యాయమవుతుందని లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాది రాష్ట్రాలకు లోక్‌సభ సీట్లు పెరుగుతాయని, దక్షిణాదికి తగ్గే ప్రమాదముందని జగన్ వెల్లడించారు.
పార్లమెంట్‌లో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం ఉండాలన్న న్యాయబద్ధతను నిలుపుకోవాలన్నారు. అందుకే డీలిమిటేషన్ ప్రక్రియలో ఎలాంటి రాష్ట్రానికీ ప్రాతినిధ్యం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇక తమిళనాడులో డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం జరుగుతుండగా, జగన్ సూచనల మేరకు వైవీ సుబ్బారెడ్డి ఈ లేఖ సారాంశాన్ని డీఎంకే నేతలకు పంపించారు. దక్షిణ రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు రాజకీయ స్థాయిలో మద్దతు కొనసాగుతుండడం గమనార్హం.