News Desk: హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం, వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ తన వ్యూహాలను మారుస్తున్నారా అన్న ప్రశ్నలు అందరిలో కలిగించాయి. బీజేపీ కంటే కాంగ్రెస్‌తో కలవడం మంచిదన్న భావనతో జగన్ ముందుకు వెళ్తున్నారా? హర్యానా ఎన్నికల ఫలితాలపై చర్చ తమకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ప్రపంచంలోని కొన్ని దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ పద్దతిని అనుసరిస్తున్నాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఈ పద్దతిని మళ్ళీ అవలంబించడం అవసరమని జగన్ ప్రస్తావించడం ప్రాధాన్యంగా నిలిచింది. అమెరికా, యూకే, జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు ఇప్పటికీ పేపర్ బ్యాలెట్‌నే ఉపయోగిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.
జగన్ తాజాగా ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తడం, బ్యాలెట్ పేపర్‌కి మళ్లీ ఆదరణ పెంచాలని డిమాండ్ చేయడం వెనుక ఉన్న అసలు కారణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని జగన్ సుదీర్ఘంగా వాదిస్తున్న సందర్భంలో, కాంగ్రెస్ కూడా ఇదే వాదనను హర్యానా ఎన్నికల ఫలితాల తరువాత చేస్తోంది.
జగన్ వ్యాఖ్యలు కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నా అనూహ్యంగా అయితే లేవు. “హర్యానా ఫలితాలు, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలకు పెద్దగా తేడా లేదు. నేను ఓడిపోలేదు, ఓడించబడాను” అంటూ జగన్ ప్రజల్లో తన అభిప్రాయాన్ని బలపర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈవీఎంల వల్లే వైసీపీకి నష్టం జరిగిందనే ఆయన నమ్మకాన్ని ప్రజలలోకి బలంగా తీసుకెళ్లి దానికి అనుకూల రాజకీయ మద్దతు కూడగట్టడమే ఆయన ఎజెండాగా కనిపిస్తోంది. ఇక్కడ విచిత్రమైన విషయమేంటంటే, జగన్ బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపించడం. ఈ పరిణామాలకు, సామాన్య ప్రజానీకంతోపాటూ రాజకీయ పండితులుకూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈవీఎంలపై జగన్ మాట్లాడిన వీడియో పోస్టు చేసింది టీడీపీ. సోషల్‌మీడియా ఆ వీడియో వైరల్ అవుతోంది. 2019లో కాంగ్రెస్ రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు జగన్ ఎందుకు ఈవీఎంలపై ఏ అభ్యంతరం వ్యక్తం చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ పరిణామాలతో, జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనే విశ్లేషణలు మళ్ళీ ఊపందుకున్నాయి. టీడీపీ నేతలు జగన్ అంతర్గత ఆలోచనలు బయటపడినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వివాదాల మధ్య, జగన్ కీలకమైన రాజకీయ సంచలనాలకు తెరలేపినట్టుగా కనిపిస్తోంది.