ఏపీ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ జైలుకు వెళ్లి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్, అధికార యంత్రాంగం, టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
తమ ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పటికి టీడీపీ నేతలు, అధికారుల చర్యలకు గట్టి బదులు ఇస్తామని హెచ్చరించారు.
గన్నవరం ఘటనలో వంశీ అన్యాయంగా అరెస్టయ్యారని జగన్ ఆరోపించారు. టీడీపీ కార్యాలయంపై దాడికి వంశీ సంబంధం లేదని, పోలీసుల స్టేట్‌మెంట్‌లో కూడా అతని పేరు లేదని తెలిపారు. అయినప్పటికీ చంద్రబాబు కుట్రపూరితంగా 71వ నిందితుడిగా చేర్చి అరెస్టు చేయించారని జగన్ మండిపడ్డారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన అన్నారు. పిడుగురాళ్ల, తుని పురపాలిక ఎన్నికల్లో టీడీపీ అన్యాయంగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకుంటోందని విమర్శించారు. ప్రజలు దీన్ని గమనించాలని జగన్ సూచించారు.
తాము అధికారంలోకి రాగానే తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. రిటైర్ అయినా, విదేశాలకు వెళ్లినా వారిని రప్పించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.