అమరావతి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. సీడబ్ల్యూసీ సిఫార్సు చేసిన సవరణలను ఆమోదించాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్ట్ జీవ నాడి అని , ప్రాజెక్ట్ పనులతో పాటు నిర్వాసితుల సమస్యలపై కేంద్రం సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రమే నిర్మించాలని ఏప్రిల్ 29, 2014 నాటి కేబినెట్ నిర్ణయం ప్రకారం ప్రాజెక్ట్ ఖర్చు పెరిగితే కేంద్రమే భరించాలన్నారు. పోలవరం పూర్తి ఖర్చు కేంద్రమే భరిస్తుందని మే 8, 2017న కేంద్ర జలవనరుల శాఖ లేఖలో కూడా తెలిపింది. ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమయ్యే కొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. డిజైన్‌లో మార్పులు, కొత్త చట్టం ప్రకారం పునరావాసం, భూసేకరణ, ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న నిరు పేదలకు పరిహారం ఇలాంటి వాటి వల్ల ప్రాజెక్ట్ అంచనా వ్యయాలు పెరిగిపోయాయి.
అక్టోబర్ 12, 2020న కేంద్ర ఆర్థిక శాఖ కొత్త మెలిక పెట్టింది. చెల్లించాల్సిన బకాయిల్లోంచి రూ.2,234 కోట్లు ఇస్తామంటూనే, సాగునీటి కాంపోనెంట్‌ను తొలగించాలని లేఖ రాసింది. ఇది విభజన చట్టంలో అంగీకరించిన దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఇప్పటికే రూ.17,656 కోట్ల ప్రజాధనం ప్రాజెక్టు కోసం వెచ్చించాం. ఈ సమయంలో కొత్త షరతులు తెస్తే ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోతుంది.
ప్రధానిగా మీరు తక్షణం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా చూడండి. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేసేలా ఆర్థిక శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖను ఆదేశించండి. 2021 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయండి’ అని విజ్ఞప్తి చేశారు.