అమరావతి: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లేఖ ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయింపులు మరియు సరఫరా గురించి ఉంది. ఆంధ్రప్రదేశ్ కి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజెన్ సరఫరా చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రధానిని కోరారు.
రాష్ట్రాంకి ఇప్పుడు చేస్తున్న 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా ఏమాత్రం సరిపోవడం లేదని లేఖలో తెలిపారు. రాష్ట్రానికి 20 ఆక్సిజన్ ట్యాంకర్లను మంజూరు చేయవలసిందిగా విగ్నప్తి చేసారు. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నామని అయినా అది అవసరాలకు సరిపోవడం లేదని తెలిపారు.
లేఖలోని ముఖ్యాంశాలు:
ఈనెల 10వ తేదీన చెన్నై మరియు కర్ణాటక నుంచి ఏపీకి రావాల్సిన ఆక్సిజన్ ఆలస్యమైందని, అందువల్ల తిరుపతిలో 11 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను 150 మెట్రిక్ టన్నులకు పెంచాలని లేఖలో కోరారు.
ఒడిశా రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుంటున్న 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కోటాను 400 మెట్రిక్ టన్నులకు పెంచాలని కూడా కోరారు. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు, వ్యాక్సిన్ టెక్నాలజీ బదిలీ చేసే అంశాన్ని కూడా సానుకూలంగా పరిశీలించాలని సీఎం లేఖలో ప్రధానిని కోరారు.
ప్రస్తుత పరిస్థితిలో టెక్నాలజీ బదిలీ తప్పనిసరి అని, వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు సహకరించాయి. ఇతర వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని, దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయొచ్చని తెలిపారు.